కళలు, సంప్రదాయ సాంస్కృతిక సందడిగా సాగిన నైమిషం ఎర్త్ ఫెస్టివల్
1 min read

కళలు, సంప్రదాయ సాంస్కృతిక సందడిగా సాగిన నైమిషం ఎర్త్ ఫెస్టివల్

 

ఎర్త్ ని మించిన వెల్త్ లేదని చాటిన ఎర్త్ ఫెస్టివల్

 

ఆకట్టుకున్న సాంస్కృతిక హస్తకళలు

పర్యావరణ హితమే అందరి అభిమతం కావాలని, అదే భవిష్యత్ లో మానవాళి కి మేలు చేస్తుందని భిన్న రంగాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియాలో జె కృష్ణమూర్తి హైదరాబాద్ సెంటర్, టీమ్ రేట్రో ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నైమిషం ఎర్త్ ఫెస్టివల్ 3వ ఎడిషన్ నిర్వహించారు. ఈ పర్యావరణ ఉత్సవంలో 70కి పైగా స్వచ్ఛంద సంస్థలు, కళాకారులు, చేనేత కార్మికులతో పాటు పలు కమ్యూనిటీ గ్రూపులు పాల్గొన్నాయి.


ఈ ఫెస్టివల్ కు ముఖ్య అతిథులుగా యునిసెఫ్ చీఫ్ ఫీల్డ్ ఆఫీసర్ డా. జెలాలెం బి. టాఫెస్సే, ఈఎస్‌సీఐ డైరెక్టర్ డా. జి. రమేశ్వర్ రావులు హాజరై మాట్లాడుతూ.. పిల్లలు, భవిష్యత్ తరాలు, పర్యావరణ సంరక్షణ–మానవ సంక్షేమం మధ్య ఉన్న లోతైన సంబంధాలపై ఫెస్టివల్ బలంగా దృష్టి సారించిందని పేర్కొన్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత , నైమిశం ఎర్త్ ఫెస్టివల్ గౌరవ సలహాదారు స్వప్న సుందరి ఈ ఫెస్ట్ లో సంస్కృతి, సంప్రదాయాలు, పర్యావరణ అవగాహన మధ్య ఉన్న అనుబంధాన్ని విశ్లేషించే ముఖ్య సెషన్‌ను క్యూఱేట్ చేశారు.

ఫెస్టివల్‌లో అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది లెర్నింగ్ జోన్. దీనిలో నేయడం, సహజ రంగులతో డైయింగ్, చెరియాల్ మాస్క్ పెయింటింగ్, సీడ్‌బాల్ తయారీ, రాక్ స్టాకింగ్, రంగోలి, సంప్రదాయ హస్తకళల శిక్షణ లో వందలాది మంది చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా స్పర్శించి నేర్చుకునే విధానం పిల్లల్లో ఏకాగ్రత, పర్యావరణంపై బాధ్యతను పెంపొందింపడమే లక్ష్యం గా నిర్వహించారు.


చేనేత, హస్తకళల జోన్‌లో సిద్ధిపేట, పోచంపల్లి, నారాయణపేటతో పాటు ఇతర చేనేత, ఖాదీ క్లస్టర్ల నుంచి వచ్చిన నేతన్నలు సందర్శకులతో నేరుగా మమేకమయ్యారు. పలువురు సందర్శకులు మొక్కల ఆధారిత, చేతితో నేసిన వస్త్రాలు, సంప్రదాయ హస్తకళలను కొనుగోలు చేయడం ద్వారా ఫెస్టివల్ సందేశాన్ని బలపరిచారు.

“వాయిసెస్ ఆఫ్ ది డెక్కన్” పేరిట జరిగిన చర్చా కార్యక్రమంలో యువ పర్యావరణ కార్యకర్త, అంతర్జాతీయ గుర్తింపు పొందిన క్లైమేట్ పిటిషనర్ రిధిమా పాండే కీలక ప్రసంగం చేశారు. తరాలకతీతంగా వాతావరణ బాధ్యత ఎంత అత్యవసరమో వివరించారు. డెక్కన్ పీఠభూమి, అడవులు, సరస్సులు, రాళ్లు, పక్షులు, హస్తకళలు, కమ్యూనిటీల వంటి అంశాలపై సురేష్ హెబ్లికర్ సహా పలువురు ప్రముఖులు ప్యానెల్ చర్చలు చేసి ప్రెజెంటేషన్స్ సమర్పించారు.


ఫెస్టివల్ లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సుర్ మండల్ ఆధ్వర్యంలో వీణా మాథ్ వయోలిన్ కచేరీ, పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, భద్రాచలం పాటలు అలరించాయి. సొసైటీ టు సేవ్ రాక్స్ సంస్థకు చెందిన నయనతార నంద కుమార్ సమర్పించిన నృత్య-నాటక ప్రదర్శన “ఎ పీస్‌ఫుల్ మూవ్‌మెంట్” ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శన, పర్యావరణ సంరక్షణ విశ్వ జన ఉద్యమంగా మారాల్సిన అవసరాన్ని చాటింది.