ఈత… కావద్దు కన్న వారికి కడుపు కోత..
స్విమ్మింగ్ ఫూల్ ప్రమాదాల్లో మృతి చెందుతున్న చిన్నారులు..
కన్నవారికి కడుపుశోకం..
జాగ్రత్తలు పాటించాల్సిందేనంటున్న పోలీసులు..
ఇటీవల కాలంలో చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్లలో పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న విషాదకర ఘటనలు కలచివేస్తున్నాయి. చిన్న నిర్లక్ష్యం కారణంగా కన్నవారికి కడుపు కొత్త మిగిలిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, అపార్ట్మెంట్ ప్రాంగణాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, పూల్ పర్యవేక్షణలో లోపించడం వంటి అంశాలు ఈ ఘటనలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారవచ్చని ఈ సంఘటనలు మనకు స్పష్టం చేస్తున్నాయి. పిల్లల భద్రత ఒక్కరి బాధ్యత, కుటుంబం, అపార్ట్మెంట్ మేనేజ్మెంట్, సమాజం అందరూ కలసి తీసుకోవాల్సిన సమిష్టి బాధ్యత. పర్యవేక్షణ, స్పష్టమైన భద్రతా నియమాలు, ముందస్తు జాగ్రత్తలతో ఇలాంటి విషాదాలను నివారించవచ్చు.
ఇటీవల మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందిన ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాలుడి తాత వాకింగ్ కోసం మనవడిని తీసుకొని భవనం కిందికి వచ్చారు. ఆయన చుట్టు పక్కల ప్రాంతంలో వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలుడు ఆడుకుంటూ వెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు.
కొద్దిసేపటి తర్వాత మనవడు కనిపించకపోవడంతో స్విమ్మింగ్ పూల్లో వెతికారు. బాలుడు అందులో విగతజీవిగా కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేపీహెచ్బీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల చిన్నారుల భద్రత కోసం సైబరాబాద్ పోలీసు వారి సూచనలు.
స్విమ్మింగ్ పూల్ నిర్వహణ, భద్రతా చర్యలు
• స్విమ్మింగ్ పూల్ చుట్టూ భద్రతా కంచె లేదా గేట్లు ఏర్పాటు చేయాలి; గేట్లకు తాళాలు తప్పక పెట్టాలి.
• నిపుణులైన లైఫ్ గార్డ్ లేదా శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది ఉన్నప్పుడు మాత్రమే పూల్ ఉపయోగించాలి.
• చిన్నపిల్లలను ఎల్లప్పుడూ పెద్దవారి పర్యవేక్షణలో ఉంచాలి.
• రాత్రి లేదా ఒంటరిగా స్విమ్ చేయకూడదు.
• పూల్ చుట్టూ పరుగులు, ఆటలు వద్దు. నీటిలో జారి పడే ప్రమాదం ఉంది.
• పూల్ పరిసరాల్లో సీసీ కెమెరాలు, సరైన లైటింగ్ ఉండేలా చూడాలి.
• లోతును సూచించే మార్కింగ్లు స్పష్టంగా ఉండాలి.
• ఫ్లోట్స్, రాప్స్, రైలింగ్స్ అందుబాటులో ఉంచాలి.
• చిన్నపిల్లల కోసం తక్కువ లోతు ప్రాంతాలు ఉండేలా ఏర్పాటు చేయాలి.
• పూల్లో ఎల్లప్పుడూ లైఫ్ గార్డ్ లేదా సూపర్వైజర్ ఉండాలి.
అత్యవసర సౌకర్యాలు
• ముందస్తుగా ఫస్ట్ ఎయిడ్ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలి.
• లైఫ్ జాకెట్లు, గాలి నింపిన రింగులు, ఇతర రక్షణ పరికరాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.
• ఎమర్జెన్సీ ఎగ్జిట్, సేఫ్టీ రూట్స్ స్పష్టంగా ఉండేలా చూడాలి.
నీటి నాణ్యత, నిర్వహణ
• నీరు శుభ్రంగా ఉందో, క్లోరిన్ తగినంత ఉందో ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి.
• నీరు మురికిగా లేదా పరిశుభ్రత లేకపోతే వినియోగం నిలిపివేయాలి.
• భద్రతా లోపాలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే యాజమాన్యం చర్యలు తీసుకోవాలి.
• పూల్ నిర్వహణ నిబంధనలను నివాసితులు మరియు అతిథులకు తెలియజేయాలి.
జాగ్రత్తలు తప్పనిసరి
• పూల్ లోకి జంప్ చేసేముందు లోతు, పరిస్థితిని పరిశీలించాలి.
• ప్రవేశించే ముందు షవర్ చేయాలి; పూర్తి చేసిన తర్వాత స్నానం చేయాలి.
• ప్రత్యేక స్విమ్మింగ్ దుస్తులు ధరించాలి.
• కళ్ళ రక్షణ కోసం గాగుల్స్ ధరించాలి, క్లోరిన్ వల్ల ఇబ్బంది తలెత్తకుండా.
• వేగంగా : స్విమ్ చేయకూడదు; ప్రతి 15 నిమిషాలకు విరామం తీసుకోవాలి.
• వాతావరణ పరిస్థితులను పరిశీలించాలి; వర్షం లేదా చలి ఎక్కువ సమయంలో ఈత వద్దు. కొత్తగా ఈత నేర్చుకునే వారు ఎల్లప్పుడూ నిపుణుల పర్యవేక్షణలో ఉండాలి.
• అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలను వెంటనే పోలీస్/సిబ్బందికి తెలియజేయాలి.
