ఐటీ కారిడార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. 57 లక్షలతో జంపైన డ్రైవర్
ఏటిఎంలో క్యాష్ నింపే వాహనంతో పరారైన డ్రైవర్..
కొద్దిదూరంలో వాహనాన్ని వదిలేసి 57 లక్షలతో జంప్
ఐటీ కారిడార్‌లో పట్టపగలు ఓ భారీ దోపిడీ జరిగింది. ఏటిఎం సెంటర్లలో క్యాష్ నింపేందుకు వెళ్లిన ఓ డ్రైవర్ డబ్బులు ఉన్న వాహనంతో పాటు పరారయ్యాడు. వాహనంలో ఉన్న ఇద్దరు కస్టోడియన్లు ఏటిఎంలో డబ్బులు పెడుతుండటం, సెక్యూరిటీ గార్డు మూత్ర విసర్జన కోసమని బయటకు వెళ్లడంతో ఇదే అదునుగా వాహనంతో పాటు డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. కొంత దూరం వెళ్లాక వాహనాన్ని రోడ్డు పక్కన పార్కింగ్ చేసి అందులో ఉన్న డబ్బులు తీసుకొని అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు.

ఈ సంఘటన గచ్చిబౌలిలోని గోపన్‌పల్లిలో జరిగింది. తిరుమలగిరికి చెందిన అజిత్ సికింద్రాబాద్‌కు చెందిన సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థకు బ్యాంకుల్లో డబ్బులు నింపే సీఎంఎస్ వ్యాన్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సంగం సెక్యూరిటీ సంస్థకు చెందిన సీఎంఎస్ వాహనంలో ఎస్. రామకృష్ణ, ఎండి. మాలిక్‌లు కస్టోడియన్లుగా, పెరుమాలు సెక్యూరిటీ గార్డుగా, అజిత్‌కుమార్ డ్రైవర్‌గా గురువారం డ్యూటీకి బయలుదేరారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 8 యాక్సిస్ ఏటిఎంలలో డబ్బులు నింపారు. గోపన్పల్లిలలోని యాక్సిస్ బ్యాంక్ ఏటిఎంలో డబ్బులు నింపేందుకు సాయంత్రం 4 గంటలకు గోపన్‌పల్లికి చేరుకున్నారు. ఇద్దరు కస్టోడియన్లు ఏటిఎంలోకి వెళ్లగా, సెక్యూరిటీ గార్డు పెరమాలు, డ్రైవర్ అజిత్ వాహనం వద్దనే ఉన్నారు. సెక్యూరిటీ గార్డు మంచినీళ్ల కోసం పక్కకు వెళ్లగానే అజిత్ ఇదే అదునుగా క్యాష్తో ఉన్న వాహనంతో పాటు అక్కడి నుండి పారిపోయాడు. తెల్లాపూర్ వద్ద వాహనాన్ని రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన అజిత్ అందులో ఉన్న 57 లక్షల క్యాష్ తీసుకొని ఉడాయించాడు.
వెంటనే అప్రమత్తమైన కస్టోడియన్ రామకృష్ణ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు వాహనం జీపిఎస్ ఆధారంగా తనిఖీ చేయగా తెల్లాపూర్‌లోని గద్దర్ జంక్షన్ వద్ద అజిత్ వాహనాన్ని వదిలేసి వెళ్లిన్నట్లు గుర్తించారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలిపారు.
