రేపే శిల్పకళా వేదికలో నాట్య తోరణం
హైదరాబాద్, వార్తమ్యాన్ : అమృత కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతియేటా నిర్వహిస్తున్న నృత్య పండుగ మళ్లీ వచ్చేసింది. సంప్రదాయ నాట్యానికి పెద్దపీట వేస్తూ నిర్వహించే ఈ నాట్య తోరణం ఆదివారం హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు పలు నాట్య రీతుల ప్రత్యక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినీఅట్టం, ఒడిస్సీ, జుగల్‌బందీ రీతులను పలువురు కళాకారిణులు ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చంద్రశేఖర్, అదనపు డీజీపీ అనిల్ కుమార్, ఆచార్య కళాకృష్ణ, సంగీత నాటక అకాడమీ అవార్డు విజేత దీపికారెడ్డి తదితరులు పాల్గొంటారు. కళల పట్ల ఆసక్తి ఉన్నవారంతా ఈ కార్యక్రమానికి విచ్చేసి, నృత్య రీతులను ఆస్వాదించాలని అమృత కల్చరల్ ట్రస్ట్ నిర్వాహకులు రాజేష్ పగడాల మరియు భార్గవి పగడాల కోరారు.
