మా భూములపై కన్నెస్తే ఖబర్ధార్… ప్రభుత్వంపై మనూ విద్యార్ధులు ఆగ్రహం
వర్సిటీకి కేటాయించిన భూముల్లో 50 ఎకరాలు వెనక్కి తీసుకోవడంపై ఆందోళన
మనూలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు..
గచ్చిబౌలి లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్లో 50 ఎకరాలను వెనక్కు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై బుధవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉర్దూ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న సెంట్రల్ లైబ్రరీ నుంచి ప్రధాన గేట్ వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. ఉర్దూ యూనివర్సిటీ ప్రభుత్వ జాగీరు కాదని, యూనివర్సిటీ భూమిపై కన్నేస్తే ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూములను వెనక్కి తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని అన్నారు. 1998లో ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిన భూములపై కన్నుపడిందని అన్నారు. ఉర్దూ యూనివర్సిటీకి ఆధీనంలో ఉన్న 200 ఎకరాల్లో నిరుపయోగంగా ఉన్న 50 ఎకరాలను వెనక్కి తీసుకుంటామని వర్సిటీ అధికారులకు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి డిసెంబర్ 15వ తేదీన నోటీసులు జారీ చేశారనే వార్త విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు.
యూనివర్సిటీ భవిష్యత్తు అవసరాల కోసం మరింత భూమిని కేటాయించాల్సిన ప్రభుత్వం ఉన్న భూమిని వెనక్కి తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
