‘గన్​’ను తాకట్టు పెట్టిన అంబర్ పేట్ ఎస్ఐ.. ఎందుకోసం అంటే ?
1 min read

‘గన్​’ను తాకట్టు పెట్టిన అంబర్ పేట్ ఎస్ఐ.. ఎందుకోసం అంటే ?

  • అన్​లైన్​ బెట్టింగ్​లో రూ. 80 లక్షల అప్పు
  • దొంగతనం కేసులో దొరికిన బంగారం వడ్డీ వ్యాపారి వద్ద కుదువ
  • తన సర్వీస్​ రివాల్వర్​ కూడా కుదువ పెట్టిన ఎస్​ఐ
  • పోలీసు శాఖకు మచ్చతెచ్చిన ఎస్​ఐ

వార్తమ్యాన్​, హైదరాబాద్​ : ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ సబ్​ ఇన్​స్పెక్టర్​ దారి తప్పాడు. పోలీస్​ విధుల పట్ల నిబద్ధతతో పనిచేయాల్సిన ఆయన పోలీస్​ డిపార్ట్​మెంట్​కే మచ్చ తెప్పేలా వ్యవహరించాడు. నేరస్థుల పట్ల కఠినంగా ఉండి వారకి ఉక్కుపాదం మోపాల్సిన ఆయనే నేరస్థుడిలా మారిపోయాడా ? అంటే అవుననే తెలుస్తుంది.
దీనంతటికి కారణం.. బెట్టింగ్​.. ప్రస్తుతం సామాన్య వ్యక్తి నుండి ఉన్నత స్థాయి వ్యక్తులు, అధికారుల వరకు కొందరిలో బెట్టింగ్​ వ్యసనంగా మారింది. ఈ బెట్టింగ్​ వ్యామోహంలో పడ్డ సదరు ఎస్​ఐ ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో ఆయన చేసిన పనికి పోలీసు శాఖ విస్తుపోయింది.

ఆ వివరాలు ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటికి చెందిన భాను ప్రకాష్‌ 2000 బ్యాచ్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌ నగరంలోని హిమాయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న భాను ప్రకాష్‌ గత కొన్నేళ్లుగా అంబర్‌పేట పోలీస్‌స్టేషన్​లో ఎస్​ఐగా పని చేస్తున్నారు. కొంత కాలం సెక్టార్‌ ఎస్‌ఐగా పని చేసిన అతన్ని క్రైం విభాగం ఎస్‌ఐగా మార్చారు.

పటేల్‌నగర్‌లో ఇంటి పని మనిషి దొంగతనం కేసులో 4.3 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు విచారణలో ఉన్న ఈ కేసు లోక్‌ అదాలత్‌లో పరిష్కారం అయింది. దీంతో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని యజమానికి అప్పగించే క్రమంలో అది కనబడటం లేదని తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు బంగారం మిస్సింగ్​పై విచారణ చేపట్టారు. కేసును విచారణ అధికారిగా ఉన్న ఎస్​ఐ భాను ప్రకాష్​ను ఉన్నతాధికారులు విచారించగా.. విస్తుపోయే విషయం తెలిసింది.

బెట్టింగ్​ డబ్బుల కోసం బంగారం తాకట్టు..

ఉన్నతాధికారుల విచారణలో ఎస్​ఐ భానుప్రకాశ్​ ఆన్​లైన్​ బెట్టింగ్​లో డబ్బులు పొగొట్టుకున్నట్లు గుర్తించారు. బెట్టింగ్‌ డబ్బుల కోసం బంగారాన్ని నారాయణగూడలోని మార్వాడీ దుకాణంలో కుదువ పెట్టినట్లు తెలుసుకున్నారు. ఈ మేరకు బంగారాన్ని స్వాధీనం చేసుకొని బాధితుడికి అందజేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఎస్​ఐ భానుప్రకాశ్​ను ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు.

గ్రూప్​–2 ఉద్యోగం వచ్చింది.. ఏపీ వెళ్లిపోతున్నా

సస్పెండ్​ అయినా తర్వాత భానుప్రకాశ్​ ఇటీవల అంబర్​పేట్​ పోలీస్​స్టేషన్​కు వచ్చాడు. తనకు ఏపీలో గ్రూప్​–2 ఉద్యోగం వచ్చిందని, అక్కడికి వెళ్తున్నానని, తన వస్తువులు తీసుకోవడానికి వచ్చినట్లు పోలీసులకు చెప్పాడు. అనంతరం స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వద్దకు వెళ్లి తన డ్రా‌లో పెట్టిన 9ఎంఎం పిస్టల్ కనిపించడం లేదని.. సీసీటీవీ కెమెరాలు చూడాలని కోరాడు.
ఉన్నతాధికారుల సమక్షంలో డ్రాను పరిశీలించగా.. బుల్లెట్లు మాత్రమే దొరికాయి, కానీ పిస్టల్ కనిపించలేదు.

ఈ సంఘటనతో పిస్టల్ మిస్సింగ్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది. అయితే గన్ గురించి మాత్రం తనకు తెలియదని, డ్రాలోనే పెట్టానని భానుప్రకాష్ విచారణలో చెబుతున్నట్లు సమాచారం. బెట్టింగ్​లో భారీగా డబ్బులు పొగొట్టుకున్న ఎస్​ఐ తన సర్వీస్​ రివాల్వర్​ను కూడా కుదువ పెట్టాడేమోనని పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐ భాను కుటుంబ సభ్యులు, స్నేహితులను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. భాను ప్రకాష్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు.