చందానగర్ సర్కిల్లో కలెక్షన్ ఏజెంట్‌గా మారిన కంప్యూటర్ ఆపరేటర్ ?
- ఏసీపీ, టిపిఎస్ల వెంట ఫీల్డ్‌కు
- ఫిర్యాదులో పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వైనం..
- చందానగర్ సర్కిల్లో గడ్డం గ్యాంగ్ అరాచకాలు..
- చందానగర్ టౌన్ ప్లానింగ్ అవినీతిపై ప్రత్యేక కథనం.
ఓ ఉద్యోగి అయినా తనకు కేటాయించిన విధులను నిర్వహిస్తాడు. తనకు రానీ పనిని చేయాలనుకోడు. కానీ జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తన రూటే సపరేట్ అంటున్నాడు. తనకు కేటాయించిన పనిని కాదని మరో పని చేస్తున్నాడు. టౌన్ ప్లానింగ్ విభాగంలో కంప్యూటర్ అపరేటర్‌గా పనిచేయాల్సిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కలెక్షన్ ఏజెంట్‌గా మారాడు.
అఫీస్‌లో కంప్యూటర్ ముందు కుర్చోవల్సిన సదరు ఉద్యోగి అఫీస్‌లో కంటే ఫీల్డ్ వర్క్ వైపే మొగ్గు చూపుతున్నాడు. చందానగర్ ఏసీపీ, టిపిఎస్ల వెంట ఫీల్డ్‌కు వెళ్తున్నాడు. ఏసీపీ కూడా ఈ కంప్యూటర్ అపరేటర్‌ను తన వసూళ్ల దందా కోసం ఉపయోగించుకుంటున్నాడు. టౌన్ ప్లానింగ్‌లో ఏదైన కంప్లైంట్లు వస్తే వాటిని తన ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నాడు.
ఏసీపీ, టిపిఎస్‌లు కంప్లైంట్ వచ్చింది ఏంటో చూడు అని.. చెప్పడమే లేట్.. వెంటనే సదరు నిర్మాణం వద్ద వాలిపోయి.. మీ బిల్డింగ్ మీద కంప్లైంట్ వచ్చాయి.. అంటూ నిర్మాణదారులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా వసూళ్లు చేస్తాడు. వచ్చిన వాటిలో ఏసీపీ, టిపిఎస్లకు వాటాలు ఇచ్చి.. మిగిలినవి తన జేబులో నింపుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆగడాలపై సర్కిల్ కార్యాలయంలో జోరుగా చర్చ జరుగుతుంది.
కలెక్షన్ ఏజెంట్‌గా మారిన కంప్యూటర్ అపరేటర్..

శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రవీణ్‌కుమార్ టౌన్ ప్లానింగ్ విభాగంలో కంప్యూటర్ అపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను అఫీస్‌లో ఉంటూ అధికారుల వద్ద కంప్యూటర్ అపరేటర్‌గా పనిచేయాలి. కానీ ఇతను ఏనాడు కంప్యూటర్ పట్టుకున్న దాఖలాలు లేవు.
సర్కిల్ ఏసీపీ నాగిరెడ్డి, టిపిఎస్‌లు రమేష్, రోహన్ ఠాకూర్ వెంట సర్కిల్లో వివిధ డివిజన్లలో పర్యటిస్తున్నాడు. టిపిఎస్‌లు కొత్తవారని వారికి డివిజన్లు సరిగ్గా తెలియవనే సాకుతో వారిని వెంట పెట్టుకొని డివిజన్లలోని అక్రమ నిర్మాణాల వద్దకు వెళ్లి నోటీసులు ఇవ్వడం, భవన నిర్మాణ సామాగ్రి తీసుకురావడం వంటి పనులు చేస్తున్నాడు.
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే ఏసీపీ నాగిరెడ్డి వెంటనే కంప్యూటర్ అపరేటర్ ప్రవీణ్‌కుమార్‌ను రంగంలోకి దించుతారు. వెంటనే ప్రవీణ్‌కుమార్ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకొని ఫిర్యాదులు వచ్చాయంటూ భారీగా వసూళ్లు చేసి, వచ్చిన వాటిల్లో వాటలు వేసి అందరికి పంచిపెడుతున్నాడు. చందానగర్ ఏసీపీకి కంప్యూటర్ అపరేటర్ ప్రవీణ్‌కుమార్ అలియాస్ గడ్డం శ్రీను కలెక్షన్ ఏజెంట్‌గా మారి అన్నీ తానై చక్కబెడుతున్నాడని తోటి ఉద్యోగులే చెప్పుకుంటున్నారు.
ఏసిపి, టిపిఎస్ల వెంట ఫీల్డ్‌కు
కంప్యూటర్ అపరేటర్ అఫీస్‌లో ఉండి అధికారులు చెప్పిన ఫైల్స్‌ను అప్లోడ్ చేయడం, డాక్యుమెంట్లు ఇవ్వడం, భవన నిర్మాణ అనుమతులు వంటి వాటిపై ప్రవీణ్‌కుమార్ పనిచేయాల్సి ఉంది. కానీ అతను ఏరోజు ఈ విధులు నిర్వహించడు. డీసీ, ఏసీపీ, టిపిఎస్లను మచ్ఛిక చేసుకొని అఫీస్‌లో కంటే ఫీల్డ్ వర్క్‌కు వెళ్లడానికే మొగ్గుచూపుతున్నాడు.
దీనికి ఒక కారణమే ఉంది. ఫీల్డ్‌లో తిరిగితే కంప్యూటర్ అపరేటర్‌గా పనిచేస్తే వచ్చే జీతం రూ.19,820 కంటే పదింతల రెట్టింపు ఆదాయం వస్తుందని నిత్యం అధికారుల వెంట ఫీల్డ్‌కు వెళ్తున్నాడు. ఏసీపీ, టిపిఎస్‌లు కూడా చైన్మెన్లు కొత్తవారు కదా ? అనే సాకుతో కంప్యూటర్ అపరేటర్ ప్రవీణ్‌కుమార్‌ను ఫీల్డ్‌కు తీసుకొని వెళ్తూ అక్రమ నిర్మాణాల వద్ద తమ పనులను కూడా చక్కబెట్టుకుంటున్నారు.
ఫిర్యాదుల పేరుతో వసూళ్ల దందా
చందానగర్ సర్కిల్లో ప్రజల నుండి అత్యధిక ఫిర్యాదులు వచ్చేవి టౌన్ ప్లానింగ్ విభాగాకే. ఈ ఫిర్యాదులే టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బందికి ఆదాయం సమకూర్చే వనరులుగా మారాయి. సర్కిల్లో మాదాపూర్, హఫీజ్‌పేట్, మియాపూర్ డివిజన్లలో అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి.
ఈ అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులకు ప్రజల నుండి ఫిర్యాదు వచ్చాయంటే చాలు వెంటనే సర్కిల్ ఏసీపీ నాగిరెడ్డి కంప్యూటర్ అపరేటర్ ప్రవీణ్‌కుమార్ అలియాస్ గడ్డం శ్రీనుని రంగంలోకి దింపుతాడు. పలానా ఏరియాలో అక్రమ నిర్మాణం జరుగుతుందని ఫిర్యాదు అందింది, ఏంటో చూసి రాపో అంటూ అతన్ని పంపిస్తాడు.
దీంతో కంప్యూటర్ అపరేటర్ అక్రమ నిర్మాణాల వద్దకు వెళ్లి నిర్మాణాలను ఫిర్యాదులు వచ్చాయంటూ భయభ్రాంతులకు గురి చేసి వారి వద్ద భారీగా డబ్బులు వసూళ్లు చేసి వచ్చిన డబ్బులో ఏసీపీ, టిపిఎస్లకు వాటాలు పంచి మిగిలినవి తన జేబులో వేసుకుంటున్నాడు. సదరు కంప్యూటర్ అపరేటర్పై ఏన్నీ ఫిర్యాదులు వచ్చిన జోనల్, సర్కిల్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని తోటి ఉద్యోగులు, ఇతర అధికారులు ఆరోపిస్తున్నారు.
