జెరానియం వ్యర్థాలతో బయోచార్(కట్టెబొగ్గు) తయరీ.. వ్యవసాయానికి ఎంతో లాభసాటి
రైతులు, పర్యావరణానికి మేలు..హెచ్‌సీయూ పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ..

వార్తమ్యాన్( స్పెషల్ స్టోరీ): వ్యవసాయ రంగంలో ‘‘బయోచార్’’ తరుచూ వినిపిస్తున్న మాట. బయో అంటే జీవం.. చార్ అంటే(చార్కోల్) బొగ్గు అని చెప్పొచ్చు. వ్యవసాయాన్ని లాభాల్లోకి మార్చుకునే క్రమంలో ఇటీవల ఈ బయోచార్ పద్దతిని వినియోగిస్తున్నారు. పంట వ్యర్థాలతో రైతులే దీన్ని సొంతంగా తయారు చేసుకొని పొలాల్లో ఎరువులుగా వాడుకోవచ్చు.
రైతులు, పర్యావరణానికి మేలు చేసేలా సరికొత్త పరిశోధన..
హైదరాబాద్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్’(హెచ్‌సీయూ) బయోచార్‌పై సరికొత్త పరిశోధనలు చేసింది. జెరానియం ఆకుల వ్యర్థాలను ఉపయోగకరమైన బయోచార్‌గా మార్చడం ద్వారా హెచ్‌సీయూ పరిశోధకులు రైతులకు, పర్యావరణానికి మేలు చేసే హరిత సాంకేతికతకు కొత్త దారులు తీశారు. ముఖ్యమైన ఆయిల్ పరిశ్రమల్లో పుష్కలంగా ఉత్పత్తి అయ్యే జెరానియం ఆకుల వ్యర్థాలను సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ‘బయోచార్’గా మార్పిడి చేసే కొత్త పద్ధతిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధి చేశారు. ‘అప్‌సైక్లింగ్ ఆఫ్ వేస్ట్ జెరానియం లీవ్స్ ఇన్‌టూ బయోచార్ ఫర్ సాయిల్ అమెండ్మెంట్’ పేరుతో హెచ్‌సీయూ లైఫ్ సైన్సెస్‌కి చెందిన ప్రొ. అప్పారావు పొడిలే, ఇంజినీరింగ్ సైన్సెస్ & టెక్నాలజీ కి చెందిన ప్రొ. డా.-ఇంగ్. వి.వి.ఎస్.ఎస్. శ్రీకాంత్ నాయకత్వంలో ఈ పరిశోధన సాగింది.

పంటల పెరుగుదలకు పురోగతి..
జెరానియం మొక్కల నుంచి లభించే వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి అధిక కార్బన్ శాతం (~65%) కలిగిన బయోచార్‌గా మార్చడంలో సక్సెస్ అయినట్లు శాస్ర్తవేత్తల బృందం తెలిపింది. దీంతోపాటు ఈ బయోచార్‌లో కాల్షియం, పొటాషియం, మ్యాగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు అధికంగా లభిస్తుండం వలన నేల సారవంతం పెరగడంలో ఇది సహకరిస్తుందని పరిశోధకులు గుర్తించారు. బయోచార్‌ను నేలలో కలపితే రోస్‌మేరీ మొక్కల పెరుగుదల, పోషకాలు గ్రహించే సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు తమ పరిశీలనల్లో తేలిందన్నారు. దీని వలన వ్యవసాయోత్పత్తి మెరుగుపడటం మాత్రమే కాకుండా, వ్యర్థాల వినియోగం ద్వారా సర్క్యులర్ బయోఎకానమీకి కూడా ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
తక్కువ ధరతో ఎక్కువ లాభం…
జెరానియం ఆకుల వ్యర్థాలు అధికంగా, చవకగా లభించడం వల్ల ఈ సాంకేతికత ఆర్థికపరంగా కూడా ప్రయోజనకరమని తెలిపారు. ఒక్క బ్యాచ్ బయోచార్ తయారీకి సుమారు 9 కెడబ్ల్యూహెచ్ మాత్రమే అవసరమవుతుందని, ఒక్క కిలో బయోచార్ తయారీ ఖర్చు అంతర్జాతీయ మార్కెట్లో లభించే చాలా కమర్షియల్ ఉత్పత్తుల కంటే తక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు బయోటెక్నాలజీ విభాగం, భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని పరిశోధకులు తెలిపారు.
ప్రొఫెసర్లు ఏమన్నారంటే..
ఈ పరిశోధనలపై అధ్యాయనం చేసిన ప్రొఫెసర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ప్రొ. అప్పారావు పొడిలే మాట్లాడుతూ.. “ఎసెన్షియల్ ఆయిల్ పరిశ్రమలో వృథా అయ్యే పదార్థాలను నేల ఆరోగ్యం, మొక్కల స్థైర్యం, కార్బన్ సేకరణకు ఉపకరించే బయోచార్‌గా మార్చడం ఈ అధ్యయనం చూపించిందన్నారు. దీని వలన పంటలు బాగా పండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
ప్రొ. డా.-ఇంగ్. వి.వి.ఎస్.ఎస్. శ్రీకాంత్ మాట్లాడుతూ…“ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్ కలిసి పనిచేయడం వల్ల ప్రాసెస్ డిజైన్ నుంచి వ్యవసాయ వినియోగం వరకు సమగ్రమైన పరిష్కారం అందించగలిగామని తెలిపారు.
