కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి లీగల్ నోటీసులు.. ఎవరు పంపారంటే ?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పరువుకు నష్టం కలిగించారని బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు లీగల్ నోటీసులు పంపించారు. బండి సంజయ్‌తో పాటు నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్‌కు కూడా లీగల్ నోటీసులు పంపించారు. తనపై, తన కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండి సంజయ్, ఎంపి అర్వింద్‌కు వేరువేరుగా లీగల్ నోటీసులు పంపించారు.

తన రాజకీయ ప్రతిష్టతను దెబ్బతిసే విధంగా, ప్రజల్లో తనకు ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని వమ్ము చేసేలా మాట్లాడారని, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు. పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన ఇద్దరు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్, ఎంపి అర్వింద్‌లకు తన లాయర్ల ద్వారా కేటీఆర్ నోటీసులు పంపించారు. ఇప్పటికే బండి సంజయ్‌పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా కేసు నడుస్తున్నప్పటికీ, మరోసారి అదే తరహాలో వ్యాఖ్యాలు చేయడం వివాదాస్పదమైంది.
