చలికాలం వేడినీటి కోసం వాటర్​ హీటర్లు వాడుతున్నారా ?
1 min read

చలికాలం వేడినీటి కోసం వాటర్​ హీటర్లు వాడుతున్నారా ?

  • జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు

  • ప్రాణాలు తీస్తున్న వాటర్ హీటర్లు

  • కరెంట్​ షాక్​తో గాల్లో కలుస్తున్న ప్రాణాలు

  • ఇంట్లో మనం చేసే పొరపాట్లే మనకు ప్రాణాంతకం

వార్త మ్యాన్​ – స్పెషల్ స్టోరీస్​  చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లటి నీటితో స్నానం చేయాలంటే చలితో వనికిపోతారు. చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది వరకు కట్టెల పొయ్యి మీద నీటిని వేడిచేసుకునేవాళ్లం.  ప్రస్తుతం గ్యాస్ పొయ్యిలు, వాటర్​ హీటర్లు, గీజర్​లు అందుబాటులోకి రావడంతో కట్టెల పొయ్యి కనుమరుగయ్యాయి.

 

ఈ రోజుల్లో చాలా మంది మద్యతరగతి ప్రజలు నీటిని వేడి చేసేందుకు వాటర్‌ హీటర్లు ఉపయోగిస్తున్నారు.కానీ ఈ వాటర్ హీటర్లు ఎంత సౌకర్యవంతంగా ఉంటాయో, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే ‘‘ప్రాణాంతకం’’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల కూడా ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు తరచూ మనం చూస్తూనే ఉన్నాం.

వాటర్​ హీటర్​ వలన జరిగే ప్రమాదాలు

వాటర్ హీటర్ల వల్ల జరిగే ప్రమాదాలలో ఎక్కువ శాతం విద్యుత్ షాక్ కారణంగానే జరుగుతున్నాయి. ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరూ తెలుసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఏంతైనా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా..
తడి చేతులతో తాకడం..  స్నానం చేసేటప్పుడు లేదా బాత్రూమ్‌లో నేలపై నీరు ఉన్నప్పుడు, తడి చేతులతో హీటర్ ప్లగ్‌ను తీయడం లేదా స్విచ్ వేయడం అత్యంత ప్రమాదకరం. తేమ, నీరు విద్యుత్‌ను వేగంగా శరీరంలోకి ప్రవహింపజేస్తాయి.
ఎర్తింగ్ లోపం..  ఇంట్లో ఎర్తింగ్ కనెక్షన్ సరిగా లేకపోతే కూడా విద్యుత్​ షాక్ వచ్చే ప్రమాదాలు ఆస్కారం ఉంది. హీటర్ బాడీకి వచ్చిన లీకేజ్ కరెంట్ భూమిలోకి వెళ్లదు. దాంతో ఎవరైనా తాకితే వారికి షాక్ తగిలే ప్రమాదం ఎక్కువ అవుతుంది.
స్విచ్ ఆన్‌లో ఉండగా నీటిని తాకడం.. ఇమ్మర్షన్ రాడ్ లేదా గీజర్ స్విచ్ ఆన్‌లో ఉండగానే నీరు ఎంత వేడెక్కిందో అని చాలా మంది చేత్తో తాకడం చేస్తుంటారు. ఇలా చేత్తో తాకడం నీటి ద్వారా కరెంట్​ శరీరంలోకి తక్షణమే ప్రవహిస్తుంది. ఈ పొరపాటు వలన మరణానికి దారితీసే అవకాశం ఎక్కువ.
నాణ్యత లేని హీటర్లు.. తక్కువ ధరలకు లభించే నాసిరకం ఇమ్మర్షన్ రాడ్లు లేదా పాత గీజర్‌లు వాడటం వల్ల వాటి బాడీల్లోకి లేదా కాయిల్‌లో నుండి కరెంట్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడూ ఐఎస్​ఐ మార్కు ఉన్న వాటర్​ హీటర్లే కొనుగోలు చేసి వినియోగించాలి.
గ్యాస్​గీజర్లతో కార్బన్​ మోనాక్సైడ్​ రిలీజ్​.. కొంతమంది వేడినీటి కోసం గ్యాస్ గీజర్లను వాడుతుంటారు. ఇళ్లలో వెంటిలేషన్ సరిగా లేని బాత్రూమ్‌లలో అమర్చుకుంటారు. గ్యాస్ పూర్తిగా మండకపోవడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనే విష వాయువు విడుదలవుతుంది. రంగు, వాసనలేని ఈ వాయువు వలన బాత్రూమ్‌లో ఉన్నవారికి తెలియకుండానే అది ఊపిరితిత్తుల్లోకి చేరి ఆక్సిజన్​ అందక ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది.
ఓవర్‌హీటింగ్​.. ఇమ్మర్షన్ రాడ్‌(వాటర్​ షీటర్​ రాడ్​)ను నీరు వేడెక్కిన తర్వాత కూడా స్విచ్ ఆఫ్ చేయకుండా వదిలేస్తే, వేడెక్కిన రాడ్ ప్లాస్టిక్ బకెట్‌ను కరిగించి, షార్ట్ సర్క్యూట్ లేదా అగ్ని ప్రమాదానికి దారితీస్తుంది.
కాలిపోవడం లేదా అగ్ని ప్రమాదం ..
గీజర్ లేదా హీటర్లను సరైన ఉష్ణోగ్రత(120F 49C మించకుండా) సెట్ చేసుకోవాలి. లేకపోతేఆ నీళ్లు ఒంటిపై పడినప్పుడు శరీరంపై తీవ్ర కాలిన గాయాలు అవుతాయి.

 

ఈ జాగ్రత్తలు పాటిస్తే సురక్షితం..

ఇమ్మర్షన్ రాడ్(వాటర్​ హీటర్​) లేదా గీజర్‌ను ఆపి ప్లగ్‌ను తీసివేసిన తర్వాతే ఆ వేడి నీటిని ముట్టుకోవాలి లేదా స్నానానికి ఉపయోగించాలి. ప్లగ్‌లు, స్విచ్‌లు ముట్టుకునేటప్పుడు మీ చేతులు, బట్టలు తప్పనిసరిగా పొడిగా ఉండాలి. ఇమ్మర్షన్ రాడ్‌ను ఎప్పుడూ ప్లాస్టిక్ బకెట్‌లో మాత్రమే వాడాలి. మెటల్ బకెట్లు ప్రమాదకరం. అదే విధంగా రాడ్ నీటిలో పూర్తిగా మునిగేలా చూసుకోవాలి. తక్కువ ధరలకు లభించే నాసిరకం హీటర్లు కాకుండా ISI మార్క్ ఉన్న నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే వాడాలి.

 

గ్యాస్ గీజర్‌ను వాడుతున్నట్లయితే దాన్ని బాత్రూమ్‌లో కాకుండా గాలి బాగా ఆడే ప్రదేశంలో బిగించాలి. బాత్రూమ్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరిగా అమర్చుకోవాలి. గీజర్లను ఏటా లేదా కనీసం రెండు ఏళ్లకు ఒకసారి నిపుణులతో సర్వీస్ చేయించాలి.టెంపరేచర్ అండ్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ వంటి భద్రతా పరికరాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్​ చేయించాలి. వాటర్ హీటర్ (ముఖ్యంగా ఇమ్మర్షన్ హీటర్ రాడ్) షాక్‌తో మరణించిన అనేక విషాదకర సంఘటనలు ఇటీవల కాలంలో జరిగాయి. ఈ సంఘటనలు ఎక్కువగా శీతాకాలంలో, ప్రజలు వేడి నీటి కోసం వీటిని ఎక్కువగా ఉపయోగించే సమయంలో జరుగుతున్నాయి.

 

ఇటీవల వాటర్​ హీటర్​ వలన జరిగిన ప్రమాదాలు..

 

మియాపూర్​లో పనికి వెళ్లి వచ్చిన మహిళ మృతి..
హైదరాబాద్​లోని మియాపూర్​లో శివలీల(40) అనే మహిళ పనికి వెళ్లి వచ్చిన తర్వాత స్నానం చేసేందుకు బకెట్​లో పెట్టిన వాటర్​ హీటర్​ నుండి కరెంట్​ షాక్​ తగిలి మృతి చెందింది.

మంచిర్యాలలో పెళ్లైన నాలుగు రోజులకే నవ వధువు మృతి..

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా, నెన్నెల మండలంలో పెళ్లైన నాలుగు రోజులకే ఒక నవ వధువు స్నానం చేసేందుకు బకెట్​లో పెట్టిన వాటర్ హీటర్ నుండి షాక్​ తగిలి మృతి చెందడంతో విషాదం నెలకొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు తీరని శోకాన్ని మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. నెన్నెల మండల కేంద్రానికి చెందిన జంబి స్వప్న(22) అదే గ్రామానికి చెందిన పల్లె సిద్ధు అనే యువకుడు ప్రేమించుకొని పెండ్లి చేసుకున్నారు. పెండ్లైన నాలుగు రోజులకు అత్తవారి ఇంట్లో స్నానం చేసేందుకు బకెట్​లో వాటర్​ హీటర్​ పెట్టగా, కరెంట్ సరఫరా లేదని భావించిన స్వప్న నీటిలో చెయ్యి పెట్టి హీటర్‌ బయటకు తీసింది. అకస్మాత్తుగా కరెంట్ రావటంతో..విద్యుత్​ఘాతానికి గురై మృతి చెందింది.
ఢిల్లీలో యువతి మృతి
ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో, స్నానం కోసం ఎలక్ట్రిక్‌ వాటర్‌ హీటర్‌తో నీళ్లు వేడి చేసుకుంటుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి 23 ఏళ్ల యువతి మరణించింది. హీటర్ చేతికి తగలడంతో ఆమె బాత్రూమ్‌లోనే ప్రాణాలు కోల్పోయింది
కృష్ణా జిల్లాలో తల్లీబిడ్డ మృతి..
కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో ఏడాది వయసున్న చిన్నారికి స్నానం చేయించడానికి నీటిలో పెట్టిన వాటర్ హీటర్ కారణంగా తల్లీ, ఏడాది వయసున్న ఆ బిడ్డ కూడా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించారు