రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు.. ఒకే చెప్పిన ముఖ్యమంత్రి
1 min read

రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు.. ఒకే చెప్పిన ముఖ్యమంత్రి

కొత్తగా మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలు..

రాష్ర్టంలో మరో ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు

వార్తమ్యాన్​, ఆంధ్రప్రదేశ్​ : నూతనంగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్​ రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాలు మార్పులు చేర్పులపై ఆంధ్రప్రదేశ్​ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అమోదం తెలిపారు.

మొదటి నుండి చెబుతున్నట్టుగా మార్కాపురం, మదనపల్లి జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. దీంతో పాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు అంగీకరించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్ష నిర్వహించిన అనంతరం మార్పులు చేర్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే చెప్పారు.

వీటిలో పాటు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా మంత్రి వర్గం అంగీకరించారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయించారు.

కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా.. ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ఓకే చెప్పారు. ఇక కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ఈ సాయంత్రం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.