సైబరాబాద్‌లో ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 928 మంది మందుబాబులు
మందు తాగి దొరికిన వారిలో బైకర్లే ఎక్కువ
ఇన్సిడెంట్ ఫ్రీ/ యాక్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్
సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఇన్సిడెంట్ ఫ్రీ/ యాక్సిడెంట్ ఫ్రీ గా ముగిసాయి. సైబరాబాద్ పోలీసుల ముందస్తు పకడ్బందీ ప్రణాళికలు, నిరంతర నిఘా, క్షేత్రస్థాయి సమన్వయంతో అమలు చేసిన భద్రతా చర్యల ఫలితంగా నూతన సవత్సర వేడుకలు సజావుగా సాగాయి.
డిసెంబర్ 31 న్యూ ఇయర్ సందర్భంగా సైబరాబాద్ సీపీ డాక్టర్ యం. రమేష్ కార్యాలయం నుండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకు ఎప్పటికప్పుడు తగు ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) డాక్టర్ గజరావు భూపాల్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన డీసీపీలు రాత్రంతా క్షేత్రస్థాయిలోనే ఉండి విధులు నిర్వర్తించారు. ట్రాఫిక్ సజావుగా సాగడం, నిబంధనల కట్టుదిట్టమైన అమలు, ప్రజలు సురక్షితంగా వేడుకలు జరుపుకునేలా విస్తృత చర్యలు చేపట్టారు.
మందు తాగి దొరికిన 928 మంది మందుబాబులు

న్యూ ఇయర్‌ను దృష్టిలో పెట్టుకొని సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అనుకోని సంఘటనలు జరగకుండా నివారించేందుకు డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సైబరాబాద్ పోలీసులు 55 బృందాలతో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 928 మందిని గుర్తించి వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేశారు.
వాహనాల వారీగా చూస్తే.. మద్యం మత్తులో పట్టుబడిన వారిలో 695 ద్విచక్ర వాహనాలు, 31 మంది త్రిచక్ర వాహనాలు, 199 ఫోర్ వీలర్ వాహనాలు, 3 భారీ వాహనాల డ్రైవర్లు ఉన్నారు. నిందితుల డ్రైవింగ్ లైసెన్సులను స్వాధీనం చేసుకుని, మోటారు వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 19 ప్రకారం సస్పెన్షన్ నిమిత్తం సంబంధిత ఆర్‌టీఏలకు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు.

కేసులు నమోదైన వారిలో 419 మంది రక్తంలో ఆల్కహాల్ మోతాదు 100 మి.గ్రా/100 మి.లీ.కు మించి ఉండగా, 35 మంది వద్ద 300 మి.గ్రా/100 మి.లీ.కు పైగా, మరో 5 మంది వద్ద అత్యంత అధికంగా 500 మి.గ్రా/100 మి.లీ.ను మించిన స్థాయిలో నమోదైంది. మియాపూర్, ఆర్‌సీ పురం, రాయదుర్గం, గచ్చిబౌలి, కుకట్‌పల్లి, మేడ్చల్, నార్సింగి, రాజేంద్రనగర్, కేపీహెచ్‌బీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల విస్తృత ప్రణాళికలు కారణంగా సైబరాబాద్ పరిధిలో ఎక్కడా పెద్ద రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోలేదని పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి ఉచిత షటిల్ సేవలను ఏర్పాటు చేశారు. సమీప మెట్రో స్టేషన్లు, నిర్దేశిత క్యాబ్ పికప్ పాయింట్లకు ఈ సేవలు అందించడంతో వేడుకల ప్రాంతాల్లో రద్దీ గణనీయంగా తగ్గింది.
ఫలితంగా కీలక రహదారి మార్గాల్లో రాత్రి 2 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గింది. మద్యం సేవించి వాహనాలు నడపడంపై “జీరో టాలరెన్స్” విధానంలో భాగంగా ప్రత్యేక దృష్టితో డ్రంక్ డ్రైవింగ్ చర్యలు ఏడాది పొడవునా కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజా భద్రతా దృష్ట్యా రోడ్లపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రమాదకరమైన చర్యలకు దూరంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
సైబరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అఫీస్‌లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. సైబరాబాద్ నూతన కమిషనర్ డా. ఎం. రమేష్ ట్రాఫిక్ జాయింట్ సీపీ డా. గజరావు భూపాల్, ఇతర డీసీపీలతో కలిసి కేక్ చేశారు. ముందస్తు ప్రణాళికలతో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కృషి చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.
