శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ప్రారంభం
జనవరి 5 వరకు అందబాటులో హస్తకళా ఉత్పత్తులు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా మాదాపూర్లోని శిల్పారామంలో షురూ అయ్యింది. డెవలప్మెంట్ కమీషనర్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ అఫ్ ఇండియా, నేషనల్ జ్యూట్ బోర్డు అండ్ శిల్పారామం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ హస్తకళా ఉత్సవం శనివారం ప్రారంభమైంది.

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళా ఉత్పత్తులు ఈ మేళాలో సందర్శకుల కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ మేళా ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని శిల్పారామం నిర్వాహకులు తెలిపారు.

ఈ మేళాలో రాజస్థాన్ కోట చీరలు, కోల్కతా జాంధానీ , తస్సార్, బెంగాల్ కాటన్, కాంత వర్క్, ఆంధ్రప్రదేశ్ కలంకారీ,మంగళగిరి,వేంకటగిరి, ఉత్తరప్రదేశ్ బనారస్, మస్లిన్, గుజరాత్ బందీని, రాజకోట, అజ్రాక్, మొదలైన చీరలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి.

మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెందిన హరిప్రియ తన శిష్య బృందంతో కలిసి భరతనాట్య ప్రదర్శనలో గణేశా స్తుతి, అల్లరిపు, శివాష్టకం, జగన్మోహన్, వీరిందవని వేణు, శివ పదం, శ్రీ చక్ర రాజా మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
