కంప్యూటర్ అపరేటర్ ఆగడాలకు అంతు లేదా ?
- అధికారులను మేనేజ్ చేయడంతో దిట్ట
- నచ్చని అధికారులు, సిబ్బందిపై కుల సంఘాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
- చందానగర్ సర్కిల్లో పాతుకుపోయిన ఉద్యోగి
- టౌన్ ప్లానింగ్‌పై ప్రత్యేక కథనం
చందానగర్ సర్కిల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ అపరేటర్ ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. అతని ఆగడాలు శృతి మించిపోతున్నాయని తోటి ఉద్యోగులు లోలోపల మదనపడుతున్నారు. సదరు కంప్యూటర్ అపరేటర్ ఆగడాలకు అంతు లేదా ? అని చర్చించుకుంటున్నారు.
అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామనుకున్నా.. తన పలుకుబడితో ఏలాంటి చర్యలు తీసుకోకుండా మ్యానేజ్ చేసుకుంటున్నాడు. తనకు నచ్చని ఉద్యోగులు, సిబ్బంది, తనపై చర్యలకు ఉపక్రమించే అధికారులు ఎవరైనా ఉంటే.. వెంటనే పలు కుల సంఘంకు సమాచారం అందిస్తాడు.
వారితో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసి వారిని తన దారికి తెచ్చుకోవడం లేదా సర్కిల్ నుండి బదిలీ చేయడం చేస్తున్నాడు. ఈ కంప్యూటర్ అపరేటర్‌ను ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే.. ప్రభుత్వంలోని ఓ బడా రాజకీయ నాయకుడి అండతో గంటల వ్యవధిలో తిరిగి తన సొంత గూటికి చేరుకునేలా చక్రం తిప్పుతాడు.

చందానగర్‌లో సర్కిల్లో పాతుకుపోయి
శేరిలింగంపల్లి మున్సిపాలిటీగా ఉన్నప్పుడు టౌన్ ప్లానింగ్ విభాగంలో 1999 మే నెలలో ఇతను ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ అపరేటర్‌గా జాయిన్ అయ్యాడు. 2007లో ఏర్పడిన జీహెచ్ఎంసీ చందానగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు ఏర్పడగా, సదరు కంప్యూటర్ అపరేటర్ చందానగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్‌లో జాయిన్ అయ్యాడు. దాదాపు 18 సంవత్సరాలుగా టౌన్ ప్లానింగ్‌లోనే పనిచేస్తున్నాడు.
అధికారులను మ్యానేజ్ చేయడంతో దిట్ట
సదరు కంప్యూటర్ అపరేటర్.. సర్కిల్‌కు కొత్తగా వచ్చిన డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీ, టిపిఎస్లతో మంచిగా ఉంటూ మచ్చిక చేసుకుంటాడు. ఆ తర్వాత వారిని తన బుట్టలో వేసుకొని కీలుబొమ్మగా మార్చుతాడు. అధికారుల అండతో అక్రమ నిర్మాణాల వద్ద స్లాబ్‌కు రేటు కట్టి భారీగా వసూళ్లు చేసి అందరికి వాటాలు వేసి పంచిపెడుతాడు.
అధికారులు కూడా అవినీతి సొమ్ము తమ చేతికి అంటకుండా వస్తుండడంతో సదరు కంప్యూటర్ అపరేటర్ చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తుండడం విశేషం. తనపై ఫిర్యాదులు వచ్చిన అధికారులు చర్యలు తీసుకోకుండా మ్యానేజ్ చేయడంలో ఆయనకు ఎవరు సాటి లేరని టౌన్ ప్లానింగ్‌లోని ఇతర సిబ్బంది చెబుతున్నారు.
నచ్చని అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులకు కుల సంఘాలతో ఫిర్యాదులు
చందానగర్ సర్కిల్లో తనకు అడ్డులేదు అని సదరు కంప్యూటర్ అపరేటర్ చెలరేగిపోతున్నాడు. సర్కిల్లో తనకు నచ్చని అధికారులు, తన పనికి అడ్డు తగిలే అధికారులు, సిబ్బందిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున్న ఉన్నాయి.
నచ్చని అధికారులు, సిబ్బందిపై కుల సంఘాలతో ఉన్నతాధికారులకు వరుసపెట్టి ఫిర్యాదులు చేయిస్తాడు. ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి వారిని సర్కిల్ నుండి బదిలీ చేయించి తన పనికి అడ్డు లేకుండా చేసుకుంటాడు. ఇలా చాలా మంది అధికారులు, సిబ్బంది సదరు ఔట్ సోర్సింగ్ కక్ష్య సాధింపు చర్యలకు బలి అయ్యారు అని తోటి ఉద్యోగులు చెబుతున్నారు.
