బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్​ నబిన్​
1 min read

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్​ నబిన్​

 

బీహార్​ రోడ్ల నిర్మాణ శాఖ మంత్రి నితిన్​ నబిన్​కు భారతీయ జనతా పార్టీ కీలక పదవి అప్పగించింది. బీజేపీ నేషనల్ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్​సింగ్​ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడిగా నితిన్​ నబిన్​ను నియమిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు అమోదించినట్లు ఆయన పేర్కొన్నారు.

 

బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా జేపీ నడ్డా 2020 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. ఆయన తన పదవీకాలం పూర్తిచేశారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలతో సహా పలు కీలక ఎన్నికల సందర్భాలను పురస్కరించుకుని ఆయన పదవీకాలాన్ని పార్టీ పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో సంస్థాగత పునర్వవస్థీకరణను పార్టీ చేపట్టింది.

 

నితిన్​ నబిన్​ భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగిన యువ నాయకుడు. నితిన్​ నబిన్​ 1980 మే 23న బిహార్‌లోని పాట్నాలో జన్మించారు. ఆయన తండ్రి దివంగత నబిన్​ కిషోర్​ ప్రసాద్​ సిన్హా కూడా బిజెపి సీనియర్​ నాయకుడు, మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. నితిన్​ నబిన్​ 1998లో ఢిల్లీలోని సీ.ఎస్.కె.ఎమ్. పబ్లిక్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తండ్రి మరణానంతరం 2006లో జరిగిన ఉపఎన్నిక ద్వారా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటినుండి నిరంతరం శాసనసభ్యునిగా కొనసాగుతున్నారు.

 

ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నితిన్​.. మొదట పాట్నా వెస్ట్ నియోజకవర్గం నుండి, ఆ తర్వాత డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) తర్వాత బాంకిపూర్ నియోజకవర్గం నుండి వరుసగా గెలిచారు. ప్రస్తుతం నితిన్​ నబిన్​ బిహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణం, పట్టణాభివృద్ధి & గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో న్యాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

 

నితిన్​ నబిన్​కు బీజేపీ పార్టీ సంస్థాగత నిర్మాణంలో మంచి అనుభవం ఉంది. భారతీయ జనతా యువ మోర్చా (BJYM) రాష్ట్ర అధ్యక్షునిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి పార్టీ సహ-ప్రభారిగానూ, ఆ తర్వాత ప్రభారిగానూ (ఇంచార్జి) వ్యవహరించారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, క్షేత్రస్థాయి కార్యకర్తలతో బలమైన సంబంధాలు కలిగిన నాయకుడిగా నితిన్​ నబిన్​కు పేరుంది. ఆయన నియామకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు, ఆయన శక్తి మరియు అంకితభావం పార్టీని మరింత బలోపేతం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.