ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తెస్తా.. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి
1 min read

ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తెస్తా.. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

ఉస్మానియా అభివృద్ధికి వెయ్యి కోట్లు మంజూరు

విద్య అందుబాటులో ఉన్నా.. నాణ్యమైన విద్య అందకపోవడమే సమస్య..

యూనివర్సిటీల్లో రాజకీయాలు, పైరవీలు ఉండవు..

ఓయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

విద్యార్థిని ఆశీర్వదిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

ఉద్యమ కాలంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థినీ విద్యార్థులు ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గత వైభవం తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు.

 

ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను విడుదల చేశారు. అనంతరం విశ్వవిద్యాలయ అభివృద్ధికి సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్, డిజైన్లను విద్యార్థుల సూచనల కోసం రూపొందించిన క్యూఆర్ కోడ్ ను విడుదల చేశారు.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. 108 సంవత్సరాల చరిత్ర కలిగి దేశంలోనే అత్యంత పురాతన యూనివర్సిటీల్లో ఉస్మానియా7 వ స్థానం, దక్షిణ భారత దేశంలో 3 వ ప్రాధాన్యత కలిగిన యూనివర్సిటీ అలనాటి స్ఫూర్తితో భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించుకునే క్రమంలో అందరినీ కలవాలని వచ్చానని చెప్పారు.

 

“గుండె నిండా అభిమానంతో యూనివర్సిటీకి వచ్చా. ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విశ్వవిద్యాలయ అభివృద్దికి భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి వచ్చాను. ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఇక్కడికి వచ్చా”అని పేర్కొన్నారు.

 

సమాజానికి ఏ సమస్య వచ్చినా యూనివర్సిటీ విద్యార్థులు కదలడం వల్లే ఆ సమస్యకు పరిష్కారం లభించిందని, అందులో తెలంగాణ ఉద్యమం కూడా ముఖ్యమైనదన్నారు. ఉద్యమాలతో విద్యార్థులు ఏమీ ఆశించలేదని, స్వేచ్ఛను, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కావాలని అడిగారని పేర్కొన్నారు.

సమావేశానికి హాజరైన విద్యార్థులు

ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొందరు కుట్రలు పన్నారని, ఉస్మానియా ప్రపంచానికి దిక్సూచిలా గొప్పగా ఎదగాలన్నది నా సంకల్పమని తెలియజేశారు. విద్య ఒక్కటే అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని, వెనుకబాటు నుంచి బయటపడేస్తుందని పేర్కొన్నారు.

 

చదువుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని, సమస్యలొచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడాలని విద్యార్ధులకు సూచించారు. ఇక్కడున్న వారిలోనే రేపు ఇలాంటి వేదిక నుంచి మాట్లాడే అవకాశం రావొచ్చని, మీలో కొందరు నాయకులై రాష్ట్రాన్ని పాలించాలని కోరారు.

 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినట్టు అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, నిజమైన సంక్షేమం పేద వాడికి చేరాలి. సామాజిక సమస్యలపై శాశ్వత పరిష్కారం కావాలని మేం ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు.

 

ప్రతి బడిలో వినిపించాల్సిన ‘జయ జయహే తెలంగాణ..’ గీతం గత పదేళ్లుగా తొక్కి పెడితే కాంగ్రెస్​ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రాష్ట్ర గీతంగా మార్చామని, బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించామని తెలిపారు.

 

దళితులు, ఆదివాసీలు, గిరిజనులు. బడుగు బలహీన వర్గాలు, రైతులు, మహిళలు నిండుమనసుతో ఆశీర్వదిస్తేనే తాను ఈ స్థాయిలో ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తెలిపారు.

 

మనకు విద్య అందుబాటులో ఉంది కానీ నాణ్యమైన విద్య అందకపోవడమే సమస్యగా మారిందన్నారు. నైపుణ్యం కలిగిన విద్యను అందించాల్సిన అవసరం ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేరుతో వేర్వేరుగా పాఠశాల నిర్వహణ వల్ల వివక్ష ఎలా రూపుమాపగలమన్నారు.

 

అందుకే ఆలోచన చేసి విద్యార్థులంతా ఒకే క్యాంపస్ లో చదువుకోవాలన్న లక్ష్యంగా మహాత్మాగాంధీ గారి స్ఫూర్తితో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్​కు శ్రీకారం చుట్టామన్నారు.

 

విద్య కోసం పెట్టే ఖర్చు భవిష్యత్తరాల కోసం పెట్టుబడిగా చూస్తున్నామని, పిల్లల్లో నైపుణ్యాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు.

 

యూనివర్సిటీలో నియామకాలు, నిర్ణయాల్లో ఎవరి పైరవీలు ఉండవని, రాజకీయ జోక్యం ఉండదని పేర్కొన్నారు. పైరవీ చేసే వారి ఉద్యోగం తీసేద్దామని తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి , సలహాదారులు కేశవ రావు, వేం నరేందర్ రెడ్డి , నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ ములుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాశీం, ప్రజా ప్రతినిధులు, పలు విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు, అధికారులు పాల్గొన్నారు.