ప్రాచీన వైద్య విధానాలకు పూర్వవైభవం తధ్యం: ఆలే శ్యామ్ కుమార్
కొండాపూర్ రాజరాజేశ్వర నగర్ లో ఆయుఃవృద్ది వెల్‌నెస్ క్లినిక్ ప్రారంభం
అందుబాటులోకి హోమియో, న్యూట్రిషనల్, యోగ, మ్యూజిక్ థెరపీలు
భారత్లో ప్రాచీన వైద్య విధానాలకు తిరిగి ఆదరణ లభిస్తుండటం ఎంతో శుభ పరిణామమని అఖిల భారత ధర్మ జాగరణ సహ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ పేర్కొన్నారు. ఆయుర్వేదం, హోమియోపతి లాంటి సాంప్రదాయ వైద్యానికి తిరిగి పూర్వ వైభవం వస్తుందన్నారు. కొండాపూర్ రాజరాజేశ్వర నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుఃవృద్ధి హోమియోపతిక్ అండ్ వెల్‌నెస్ క్లీనిక్ ని ఆయన లాంఛనంగా ప్రారంభించి, సంస్థ లోగోను ఆవిష్కరించారు.
శేరిలింగంపల్లి ప్రాంత వాసులకు అధునాతన హోమియోపతి సేవలతో పాటు న్యూట్రిషనల్, యోగ, మ్యూజిక్ థెరపిలను అందుబాటులోకి తీసుకురావడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఒకవేళ అనారోగ్యం బారిన పడ్డప్పుడు ప్రాథమిక దశలోనే ఆయుర్వేదం, హోమియోపతి లాంటి సాంప్రదాయ వైద్యంను ఎంచుకోవాలని సూచించారు.
భారతీయ జీవన విధానంలో ప్రాచీన వైద్య విధానాలు ఎన్నో అందుబాటులో ఉండేవని అందులో విశిష్టమైనది మ్యూజిక్ థెరపీ అని అన్నారు. రాగాలను ఉపయోగించి రోగాలను నయం చేసే ప్రాచీన పద్ధతి కాలక్రమంలో కనుమరుగైనప్పటికీ ఇటీవల మళ్లీ ప్రాధాన్యతను సంతరించుకోవడం గొప్ప విషయమని అన్నారు. కరోనా తర్వాత మన ప్రాచీన సాంప్రదాయ వైద్య విధానానికి తిరిగి ఆదరణ లభిస్తుండడం, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం మనకెంతో గర్వకారణమని అన్నారు.
ఈ సందర్భంగా ఆయుఃవృద్ధి వ్యవస్థాపకురాలు డాక్టర్ సింధు బైరవి, ఫైనాన్స్ డైరెక్టర్ మనోహరి, మ్యూజిక్ థెరపిస్ట్ వశిష్ట రామ్, సలహాదారులు చింతకింది గోవర్ధన్ గౌడ్ లను ఆలె శ్యామ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. వెల్‌నెస్ సెంటర్ లోని వివిధ విభాగాలను అతిథులుగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్, ఎస్బిఐ రిటైర్డ్ ఏజిఎం బాల్ద అశోక్, యోగా శిక్షకులు పుట్ట వినయ్ కుమార్ గౌడ్, ప్రముఖ వ్యాపారవేత్త రాఘవేంద్రరావులు ప్రారంభించారు. .
