‘భార్య, అత్తపై కోపం..డబ్బు సంపాధించాలనే కసి’యే అతన్ని క్రిమినల్ చేసిందా..?

ఇమ్మడి రవి ఇంత తోపా ?
ఐ బొమ్మ, బప్పం టీవీల రూపకల్పనకు దారి తీసిన అంశాలు ఏంటి..
సినిమా ఇండస్ర్టీ పెద్దలకు కొరకరాని కొయ్యగా మారిన రవి..
భార్యే పోలీసులకు పట్టించిందా.. ఆస్తులు అమ్మేందుకు వచ్చి దొరికిపోయాడా ?
ఇమ్మడి రవి క్రిమినల్ అంటున్న పోలీసులు, సినిమా ఇండస్ర్టీ..
అతని టాలెంట్‌ను పొగుడుతూ మద్దతు తెలియజేస్తున్న జనాలు..
ఐబొమ్మ, బప్పం టీవీ ఈ రెండు పైరసీ వెబ్సైట్లు రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాల్లోని తెలియని సినిమా ప్రేక్షకులు ఉండరు. సినిమా థియేటర్‌కు వెళ్లి వందలాది రూపాయలు ఖర్చు చేసి సినిమా చూడలేని వారు ఈ రెండు పైరసీ వెబ్సైట్ల ద్వారా ఎన్నో సినిమాలు ఇంట్లోనే కూర్చొని చేశారు.

వీటంన్నింటికి మూల కారణం.. ఈ వెబ్సైట్ల సృష్టికర్త ఇమ్మడి రవి.. తన ఇంటి పేరులోని మొదటి అక్షరం వచ్చేలా ఐబొమ్మను సృష్టించి సినిమా ఇండస్ర్టీని షేక్ చేసాడు.
ఇమ్మడి రవి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ పేరు తెలియని వారుండరు. ప్రస్తుతం సినిమా ప్రేక్షకులు ఇతన్ని తమ ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు. అదే సినిమా ఇండస్ర్టీ దర్శకులు, నిర్మాతలు, హిరోలు మాత్రం ఇతన్ని విలన్‌గా చూస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న సినిమా టికెట్ రేట్ల వలన సామాన్య ప్రజలు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడలేని పరిస్థితి.. వీరందరూ ఐ బొమ్మ, బప్పం టీవీ అనే యాప్‌ల ద్వారా కొత్త సినిమా రిలీజ్ అయినా ఒక్క రోజులోనే హెచ్‌డీ క్వాలిటీలో సినిమాలు చూసేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఇమ్మడి రవి. ఇతనే ఈ రెండు పైరసీ వెబ్సైట్ల సృష్టికర్త. కానీ వీటి వలన సినిమా ఇండస్ర్టీ వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో ఐబొమ్మ, బప్పం టీవీల రూపంలో రవి సినిమా ఇండస్ర్టీ పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు.
సినిమా పైరసీపై తెలుగు సినిమా ఇండస్ర్టీ పెద్దలు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ర్టాల్లో గత వారం రోజులుగా ఇమ్మడి రవి పేరు మారు మోగిపోతుంది..
ఎవరీ ఇమ్మడి రవి ?
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి అప్పారావు కుమారుడు ఇమ్మడి రవి అలియాస్ ప్రహ్లద్కుమార్ స్థానికంగానే బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు.ఆ తర్వాత ముంబై వెళ్లి అక్కడి యూనివర్సిటీలో ఎంబిఏ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్/వెబ్ డిజైనర్ కొంత కాలం పనిచేశాడు. ఆ తర్వాత ER Infotech అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈఓగా పనిచేశాడు.
కోచింగ్ సెంటర్‌లో ప్రేమ.. ఆ తర్వాత పెండ్లి..
— ఇమ్మడి రవి డిగ్రీ పూర్తి అయినా తర్వాత అమీర్‌పేట్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకుంటున్న సమయంలో ఉన్నత కుటుంబానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రేమించిన అమ్మాయిని ఇమ్మడి రవి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె కూడా ఉంది. ప్రేమించి పెండ్లి చేసుకున్న రవికి వెబ్ డిజైనర్‌గా పనిచేస్తున్నా కూడా ఆర్థిక సమస్యలు తలెత్తాయి.
భార్య, అత్తపై కోపం..డబ్బు సంపాధించాలనే కసియే ఐబొమ్మ, బప్పం టీవీకి రూపం..
ప్రేమ వివాహం అపై భార్య ఉన్నత కుటుంబానికి చెందిన యువతి కావడంతో ఖర్చులు పెరిగిపోయాయి. వెబ్ డిజైనర్‌గా పనిచేస్తున్నా వచ్చే జీతం సరిపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. వీటికి తోడు రవికి తక్కువ జీతం వస్తుండడంతో భార్య, అత్త తరచుగా హేళన చేసేశారు. ‘సంపాదన చేతకాదు’ అంటూ రవిని అవమానించడం మొదలుపెట్టారు. భార్య, అత్త అవమానాలకు, ఒత్తిడికి తట్టుకోలేక ఏలాగైనా త్వరగా డబ్బు సంపాదించాలనే కసి ఏర్పడింది. తనకున్న వెబ్ డిజైనింగ్ టెక్నాలజీని ఉపయోగించి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు.
తన టెక్నికల్ నాలెడ్జ్‌తో ‘ఐబొమ్మ’, ‘బప్పం టీవీ’ వంటి పైరసీ వెబ్‌సైట్‌లను రూపొందించాడు. థియేటర్లు, ఓటీటీల్లో సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్‌లను ఈ సైట్లలో ఉచితంగా అందుబాటులో ఉంచేవాడు. దీంతో కొద్ది కాలంలోనే రవి ఊహించని విధంగా వీక్షకులు పెరిగి, వెబ్సైట్ల ద్వారా బెట్టింగ్ యాప్ నిర్వాహకుల ప్రకటనలు రావడంతో రవి భారీగా డబ్బు సంపాదించాడు.
కుమార్తెను వెంట తీసుకెళ్లిన భార్య.. ఒంటరిగా మిగిలిన రవి..
వెబ్సైట్ల ద్వారా భారీగా డబ్బులు సంపాధించిన రవికి వైవాహిక జీవితంలో ఆనందం లేకుండా పోయింది. ఇంత డబ్బు సంపాదించిన కూడా రవి భార్య తనతో కలిసి ఉండేందుకు ఇష్టపడలేదు. ఆర్థిక ఇబ్బందులు, మనస్పార్థాల కారణంగా ఇద్దరూ2021లో తీసుకున్నారు. భార్య తన కుమార్తెను వెంట తీసుకోని వెళ్లడంతో రవి ఒంటరయ్యాడు. భార్యతో విడిపోవడం, కుమార్తె తన వెంట లేకపోవడంతో మానసికంగా కృంగిపోయాడు.
మకాం మార్చి.. పెద్ద ఎత్తున సినిమాలు పైరసీ చేస్తూ..
ఇండియా నుండి రవి తన మకాన్ని మరో దేశానికి మార్చుకున్నాడు. 2022లో ఇండియా పౌరసత్వాన్ని వదులుకున్నాడు. దాదాపు రూ. 80 లక్షలు చెల్లించి కరేబీయన్ దీవుల్లోని సెయింట్స్ కీట్స్ అండ్ నెవీస్ దేశం సిటీజన్ షిప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో నివాసం ఉంటున్నాడు.
వెబ్సైట్ ముసుగులో 50 లక్షల మంది డేటా అమ్మేసిండు..
ప్రేక్షకులను తన వెబ్సైట్ల ద్వారా ఉచితంగా సినిమాలు చూసే 50 లక్షల మంది యూజర్ల డేటాను సైబర్ నేరగాళ్లకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. దీని ద్వారా రవి సుమారు రూ. 20 కోట్లు సంపాదించినట్లు తెలిసింది. —సినిమా పైరసీల ద్వారా ఇమ్మడి రవి సినిమా ఇండస్ర్టీ పెద్దలకు కొరకరాని కొయ్యగా మారాడు. విదేశాల్లో ఉంటూ సినిమాలను పైరసీ చేస్తున్న రవిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భార్యే పట్టించిందా.. ఆస్తులు అమ్మేందుకు వచ్చి దొరికిపోయాడా ?
తనపై నమోదు అయినా కేసులపై ఇమ్మడి రవి తన వెబ్సైట్ ఐబొమ్మ ద్వారా “దమ్ముందు పట్టుకోండి”అంటూ హైదరాబాద్ పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో పోలీసులు ఇమ్మడి రవి కదలికలపై దృష్టి సారించాడు. ఇదిలా ఉండగా హైదరాబాద్, విశాఖపట్నంలోని తన ఆస్తులను అమ్ముకునేందుకు కూకట్‌పల్లిలోని ఫ్లాట్‌కు వచ్చాడనే సమాచారంతో హైదరాబాద్ పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. భర్తపై కోపంతో విడాకుల కోసం రవి విదేశాల నుండి హైదరాబాద్‌కు వస్తున్నాడు అనే సమాచారాన్ని రవి భార్యే పోలీసులకు చెప్పి పట్టించింది ప్రచారం జరుగుతుంది.
సోషల్ మీడియాలో ఇమ్మడి రవికి పెరుగుతున్న మద్దతు..
—
ఐబొమ్మ, బప్పంటీవీ వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో రవి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోషల్‌మీడియాలో రవికి మద్దుతు పెరుగుతుంది. కొందరూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా.. మరికొందరూ మాత్రం రవి చేసిన పనికి మద్దతు తెలియజేస్తున్నారు. ఇమ్మడి రవి జీవిత కథ ఆధారంగా సినిమా తీసేందుకు ఓ నిర్మాణ సంస్థ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
—
